Astronauts: భూమిని చేరిన వ్యోమగాములు..అసలైన పరీక్ష ఇప్పుడే 1 y ago
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, సురక్షితంగా భూమికి చేరుకున్నారు. 2025 మార్చి 19, భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటలకు వారు ప్రయాణించిన డ్రాగన్ క్రూ కాప్సూల్ ఫోరిడా తీరంలో సముద్రజలాల్లో పారాచూట్ల సాయంతో సురక్షితంగా చేరారు. సునీతా, బుచ్ తో పాటు మరొక ఇద్దరు వ్యోమగాములు కూడా వచ్చారు. వారిని నాసా సిబ్బంది జాగ్రత్తగా క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకొని, వైద్య పరీక్షల కోసం స్ట్రెచ్పై తరలించారు. అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపిన సునీతా, బుచ్ కండరాల క్షీణత, బ్యాలెన్స్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐఎస్ఎస్లో గడిపిన సమయం వల్ల వారి శరీరాలు బలహీనంగా మారాయని నిపుణులు వెల్లడించారు.
ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలిస్తారు. అక్కడ, నాసా వైద్యులు వారి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తారు. ఆ సమయంలో వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిని నానా వైద్యులు పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మాత్రమే వారి కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతిస్తారు. అంతరిక్షంలో వ్యోమగాముల అనుభవాలను నాసా రికార్డు చేస్తుంది. వారు ఎదురైన సవాళ్లు, అనుభవాలు, తమ ప్రయాణంలో గమనించిన అంశాలను రికార్డు చేసి, భవిష్యత్తులో మరింత ఆధారంగా ఉపయోగిస్తారు.
భూమ్మీదకు తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములకు తమ కుటుంబ సభ్యులతో మాత్రమే కాదు, తమ పెంపుడు శునకాలను కలవాలనే కోరికను సునీతా విలియమ్స్ ఇటీవల వ్యక్తం చేశారు. గతేడాది బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా ఇద్దరు వ్యోమగాములు తొమ్మిది నెలలపాటు అక్కడే చిక్కుకుపోయారు.